విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కాలి బూడిదైన పంటలు.. రైతుల ఆరోపణ

టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో చెలరేగిన మంటల్లో ఆయిల్ ఫామ్ తోట, మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రైతు పాక ఐలమ్మ భర్త ఎల్లయ్యకు చెందిన ఆయిల్ ఫామ్ తోట, కంది శ్రీపాల్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డికి చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని పంటలకు మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి.
మూడు సంవత్సరాలుగా ఎంతో శ్రమించి సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోట పూర్తిగా దగ్ధం కావడం, కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట కూడా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన నష్టంపై ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్పందించి విద్యుత్ శాఖ అధికారుల ద్వారా తక్షణ నష్టపరిహారం అందించాలని వారు కోరారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
