ఈటల రాజేందర్ స్పష్టం: “పార్టీ మార్పు అసత్య ప్రచారం… బీజేపీలోనే కొనసాగుతా”
శామీర్‌పేట్, ఏప్రిల్ 5(Zindagi9News): మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తనపై జరుగుతున్న పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు. తాను బీజేపీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తాను పార్టీ మారుతున్నట్లు పోస్టర్లు వేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

శామీర్‌పేట్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈటల మాట్లాడుతూ, “పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు. నేను ఎప్పుడూ పార్టీలు మారకూడదనే సందేశం ఇచ్చాను” అన్నారు. తన గురించి తెలంగాణ ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని తెలిపారు.
కేసీఆర్ తనను బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేసి ఐదేళ్లు అయ్యాయని గుర్తు చేశారు. “నన్ను పార్టీ నుంచి పంపించడమే కాకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కోళ్ల ఫార్మ్‌లు కూల్చారు, భూములు గుంజుకున్నారు. నేను లీగల్‌గా కొనుగోలు చేసిన భూములను కూడా చెరబట్టారు” అంటూ ఆరోపించారు.
తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ, “మళ్లీ కేసీఆర్‌తో కలుస్తారనే పిచ్చి ప్రచారాలను నమ్మొద్దు” అని స్పష్టం చేశారు. “సందర్భం వస్తే ఈటల రాజేందర్ ఎవరో తెలుస్తుంది” అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఈ ప్రభుత్వం బుకాయిస్తూ, దాబాయిస్తోంది. మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నారు. అబద్ధాల పునాదుల మీదే ఈ ప్రభుత్వం నిలబడింది” అని ఆరోపించారు.
జిహెచ్ఎంసీ ఎన్నికలపై స్పందిస్తూ, సర్వేలు నిర్వహిస్తున్నామని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. “టికెట్లు గెలిచే వారికి ఇస్తాం. నా వ్యక్తి అనే ప్రమాణం ఉండదు” అని చెప్పారు.
తన రాజకీయ ప్రయాణంపై మాట్లాడుతూ, గతంలో ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా, పదవుల కోసం పాకులాడలేదని వెల్లడించారు. “మంత్రిపదవి, డిప్యూటీ సీఎం అవకాశాలు ఉన్నా కూడా నా కమిట్మెంట్కు కట్టుబడి ఉన్నాను” అని అన్నారు.
పార్లమెంట్ పరిధిలో సమస్యలపై ప్రధానికి లేఖ రాసినట్టు తెలిపారు. అలాగే, హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజలు పిలిస్తే వెళ్లి నాయకత్వం వహిస్తానన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శిస్తూ, “గత ప్రభుత్వంలో దోచుకున్నదంతా కక్కిస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు?” అని ప్రశ్నించారు. భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
మొత్తానికి, తాను ప్రజలు, ధర్మాన్ని నమ్ముకుని రాజకీయాల్లో ముందుకు సాగుతున్నానని, సోషల్ మీడియా ప్రచారాలను నమ్మబోనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
