హుజూరాబాద్ హనుమాన్ దేవస్థానంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ.20 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ఆగస్టు 15 (Zindagi9News): హుజూరాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవస్థానంలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు (SDF) నుంచి మంజూరైన రూ.20 లక్షలతో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. హనుమాన్ దేవాలయ అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఆలయ కమిటీ ఏర్పడిన అనంతరం అభివృద్ధి పనుల కోసం వొడితల ప్రణవ్కు వినతిపత్రం అందజేయగా, ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా కృషి చేశారని పేర్కొన్నారు.
వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు అవసరమైన నిధులు కేటాయించి, వాటి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, ఆలయ చైర్మన్ శంకర్, కమిటీ సభ్యులు, ఈఓ సుధాకర్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
