ఆటో కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం.. సమ్మె విరమణ

హైదరాబాద్: ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం ఆటో కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి నిరవధిక సమ్మెను విరమించిన ఆటో కార్మిక సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై సెప్టెంబర్ 1న కార్మిక శాఖ, రవాణా శాఖ, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. 2012 తర్వాత ఆటో చార్జీలు పెరగలేదని, చార్జీల పెంపుపై నివేదిక తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ను ప్రారంభించే ప్రక్రియను ఐటీ శాఖ ద్వారా చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాపిడో, ఓలా, ఉబెర్ తరహా ద్విచక్ర వాహనాల ప్రయాణికుల రవాణాపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
గత ఎన్నికల హామీ మేరకు ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణ కోసం పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను రెట్రోఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం సహాయం అందించనున్నట్లు తెలిపారు. కొత్త ఆటోలు కొనుగోలు చేసేందుకు సబ్సిడీ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఆర్టీసీ తరఫున ఈవీ ఆటోలు కొనుగోలు చేస్తారన్న ప్రచారం అవాస్తవమని, అది కేవలం దుష్ప్రచారమేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యల పట్ల పూర్తి సానుకూలంగా ఉందని తెలిపారు. చర్చల్లో రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు రమేష్, చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
