ఘనంగా జననేత వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు
నియోజకవర్గం నలుమూలలా వేడుకలు.. రక్తదాన శిబిరాలు, అన్నదానం, రైతు కూలీలకు చీరల పంపిణీ

హుజూరాబాద్, ఆగస్టు 15 (Zindagi9News): హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను వొడితల ప్రణవ్ ఆవిష్కరించారు. అనంతరం హుజూరాబాద్ హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
నియోజకవర్గ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు
ప్రణవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 150 మంది రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అలాగే పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రైతు కూలీలకు చీరల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నాయకులు, అభిమానులు నిర్వహించారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరింతగా సేవ చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు చేరేలా కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, దేవస్థానాల చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్, డైరెక్టర్లు, జిల్లా అధికార ప్రతినిధులు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా నాయకులు, వార్డు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువజన, NSUI, మైనారిటీ, సేవాదళ్, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
