
హజ్ యాత్రికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్..హజ్ ప్రయాణ ఖర్చులపై సీఎం కీలక ప్రకటన
హైదరాబాద్: హజ్-2026 యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. విమాన ఛార్జీలు పెరగడంతో యాత్రికులపై పడే అదనపు రూ.10,000 భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హజ్ యాత్రకు వెళ్లే రాష్ట్ర ముస్లిం యాత్రికులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం సహాయం అందిస్తుందని సీఎం తెలిపారు. పెరిగిన విమాన ఛార్జీల భారం యాత్రికులపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఇక రాజకీయ అంశాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, SIR ప్రక్రియ పేరుతో తెలంగాణలో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీసే విధంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయొద్దని ఆయన సూచించారు.
ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని, ప్రతి అర్హుడైన ఓటరికి హక్కు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
