బీసీ కులాల పేర్ల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: వెనుకబడిన తరగతుల (బీసీ) కోసం తెలంగాణ బీసీ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక, విద్యా పరంగా వెనుకబడిన జాబితాలో ఉన్న కొన్ని కులాల పేర్ల మార్పు, పర్యాయ పదాల చేర్పులకు రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది.

కేబినెట్ ఆమోదించిన మార్పులు ఇవీ:
- గ్రూప్-ఏలో వరుస సంఖ్య 7లో ఉన్న “దొమ్మర” అనే పదాన్ని తొలగించి “గడ వంశీయ”గా మార్పు చేశారు.
- గ్రూప్-ఏలో వరుస సంఖ్య 18లో ఉన్న “పిచ్చకుంట్ల” అనే పదాన్ని తొలగించి “వంశ రాజ్”గా నమోదు చేయనున్నారు.
- గ్రూప్-డీలో వరుస సంఖ్య 29లో ఉన్న “శూద్ర కులం” అనే పదాన్ని తొలగించి “తమ్మలి (బ్రాహ్మణేతర)”గా మార్పు చేశారు.
- గ్రూప్-ఏలో వరుస సంఖ్య 4లో ఉన్న “బుడబుక్కల”కు “శివ క్షత్రియ” అనే పర్యాయ పదాన్ని చేర్చడంతో ఇకపై “బుడబుక్కల శివ క్షత్రియ”గా నమోదు చేయనున్నారు.
- గ్రూప్-ఏలో వరుస సంఖ్య 5లో ఉన్న “వన్నార్” పదాన్ని తొలగించి “ధోబీ”ని చేర్చారు. దీంతో “రజక, చాకలి, ధోబీ”గా నమోదు చేయాలని నిర్ణయించారు.
- గ్రూప్-డీలో వరుస సంఖ్య 5లో “మేరు”ను పర్యాయ పదంగా చేర్చడంతో “మేర, మేరు, చిప్పోలు”గా నమోదు చేయనున్నారు.
- గ్రూప్-ఏలో వరుస సంఖ్య 23లో ఉన్న “వీరభద్రియ”కు “వీరముష్టి, నెట్టి కోటల” అనే పర్యాయ పదాలను చేర్చారు. దీంతో “వీరభద్రియ, వీరముష్టి, నెట్టి కోటల”గా నమోదు చేయనున్నారు.
ఈ మార్పులు సంబంధిత వర్గాల అభ్యర్థనలు, బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
