
బిగ్ బ్రేకింగ్: హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు!
ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశం..
హైదరాబాద్ (Zindagi9News): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కోవాలంటూ రాష్ట్ర నేర పరిశోధన విభాగం (CID) ఆయనకు షాకిచ్చింది. కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023లోని సెక్షన్ 35(3) కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. వచ్చే శనివారం (ఏప్రిల్ 4) ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు.
అసలేం జరిగింది? (కేసు నేపథ్యం):
ఈ ఏడాది జనవరి 29న హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారన్న కోపంతో కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి హుజూరాబాద్‌లోని కె.సి. క్యాంప్ చౌరస్తా వద్ద నడిరోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటనపై అప్పట్లోనే హుజూరాబాద్ పోలీసులు క్రైమ్ నంబర్ 30/2026 కింద కేసు నమోదు చేశారు.
సీఐడీ నోటీసులో సంచలన ఆరోపణలు:
సీఐడీ జారీ చేసిన నోటీసులో ఎమ్మెల్యేపై ఉన్న ఆరోపణలను పూసగుచ్చినట్లు వివరించారు:
- విధుల ఆటంకం: జాతర బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ట్రాఫిక్‌ను స్తంభింపజేయడం.
- అధికారులపై దూషణలు: కరీంనగర్ పోలీస్ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను ఉద్దేశించి అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం.
- విద్వేషం రెచ్చగొట్టడం: ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం.
- కఠిన షరతులు.. హాజరు తప్పనిసరి!
- విచారణకు హాజరయ్యే సమయంలో కౌశిక్ రెడ్డి తన ఐడెంటిటీ ప్రూఫ్‌లతో పాటు, ఈ కేసుకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉంటే వెంట తీసుకురావాలని సీఐడీ డీఎస్పీ రంగస్వామి ఆదేశించారు. విచారణకు సహకరించకపోతే లేదా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా అరెస్టు చేసే అవకాశం కూడా ఉంటుందని నోటీసులో పరోక్షంగా హెచ్చరించారు.
- జనవరిలో జరిగిన ఈ వివాదంపై ఎమ్మెల్యే అప్పట్లోనే వివరణ ఇచ్చినప్పటికీ, సీఐడీ ఇప్పుడు రంగంలోకి దిగడంతో హుజూరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి ఏప్రిల్ 4న విచారణ తర్వాత సీఐడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
