రసాయన ఎరువులకు స్వస్తి పలకాలి.. ప్రకృతి వ్యవసాయంవైపు రైతులు మళ్లాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్

జమ్మికుంట, జూన్ 11(Zindagi9news): రసాయన ఎరువులతో పండించిన పంటలను కొనుగోలు చేసి తినడం అంటే పైసలు ఇచ్చి రోగాలను కొనుక్కొచ్చుకోవడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రైతులు ఇకనైనా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో నిర్వహించిన “ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం” కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకృతి వ్యవసాయంపై విస్తృత అవగాహన కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు.
రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను సేంద్రీయ వ్యవసాయంవైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటానని బండి సంజయ్ ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మద్దతు ధర కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో ఎరువుల సబ్సిడీ కోసం ప్రతి ఏడాది సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, అందులో రూ.1.20 లక్షల కోట్ల విలువైన ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అవసరమని చెప్పారు.
రసాయన ఎరువుల అధిక వినియోగం కారణంగా పంజాబ్ వంటి రాష్ట్రాల్లో క్యాన్సర్ కేసులు పెరిగాయని, సమాజంలో అనేక అనారోగ్య సమస్యలకు ఇది కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో లభించే అనేక ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన, పీఎం-ప్రణామ్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి సంవత్సరానికి రూ.4 వేల చొప్పున రెండేళ్ల పాటు ప్రోత్సాహక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.
“మేక్ ఇన్ ఇండియా”, “స్టార్టప్ ఇండియా” వంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రు నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కేవీకే వ్యవస్థాపక సభ్యుడు విజయపాల్ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్ రావు, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
