
పెబ్బేరు మార్కెట్ యార్డులో రైతుల సమస్యలు తెలుసుకున్న బీజేపీ నేతలు
పెబ్బేరు: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెబ్బేరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని వరి ధాన్య సేకరణ కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు గత నెల రోజులుగా వరి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువచ్చి పగలంతా కష్టపడి ఆరబెట్టినా, ధాన్యాన్ని కాంట చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు తెలిపారు.
రైతుల నుంచి తరుగు పేరుతో క్వింటాలుకు ఆరు కిలోల వరి తీసుకోవడం, రవాణా (ట్రాన్స్పోర్ట్) విషయంలో కూడా అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ధాన్య సేకరణపై సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ధాన్య సేకరణలో అధికారులు అలసత్వం వహించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే రైతులతో కలిసి రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కావలి క్రాంతి కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు మొగిలి రాఘవేంద్ర గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కంచె ఆంజనేయులు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సూరగౌని రంగస్వామి గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చింతల రామకృష్ణ, జిల్లా విద్యాసెల్ కన్వీనర్ నరసింహ నాయుడు, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు చింతకాయల శివ, పట్టణ ప్రధాన కార్యదర్శులు అల్వల సర్వేశ్వర్ గౌడ్, మోతె రాఘవేంద్ర, దిలీప్ రెడ్డి, పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జ్ జగత్కారి నర్సోజీ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
