నిజామాబాద్ ఎక్సైజ్ అధికారిపై అక్రమాస్తుల కేసు
ఏసీబీ దాడుల్లో రూ.3 కోట్ల ఆస్తులు గుర్తింపు

నిజామాబాద్, జూన్ 23(Zindagi9news): నిజామాబాద్ జిల్లా (Prohibition) ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారి (ఎక్సైజ్ సూపరింటెండెంట్) కొమ్మూరి మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది. అవినీతి, అక్రమ మార్గాల ద్వారా తెలిసిన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి మంగళవారం ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీలు, అనుచరులకు చెందిన మరో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నాలుగు నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనం, ఎనిమిది ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. అలాగే సుమారు రూ.3.31 లక్షల నగదు, రూ.50 లక్షల బ్యాంకు నిల్వలు, అధికారి భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న మూడు బ్యాంకు లాకర్లను గుర్తించారు. ఒక గ్రాండ్ విటారా కారు, టీవీఎస్ స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.3 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు ఏసీబీ తెలిపింది. స్థిరాస్తుల మార్కెట్ విలువ పత్రాల విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోందని, నిందిత అధికారిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది.
