భూ సర్వే కోసం రూ.25 వేల లంచం డిమాండ్.. సైదాపూర్ మండల సర్వేయర్ ఏసీబీ వలలో

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల సర్వేయర్ యెక్కలదేవి కుమారస్వామి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. భూ సర్వే నిర్వహించి అధికారిక అనుకూలత కల్పించేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
ఇప్పటికే రూ.5 వేలను యూపీఐ ద్వారా, మరో రూ.10 వేలను నగదు రూపంలో తన ప్రైవేట్ సహాయకుడు వంగా విహిత్ రెడ్డి ద్వారా స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన రూ.10 వేలను శుక్రవారం మరో ప్రైవేట్ సహాయకుడు తీగల రాజేష్ ద్వారా తీసుకుంటున్న సమయంలో కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడికి చెందిన అమ్మంగుర్తి గ్రామంలోని భూమి సర్వే నిర్వహించేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. లంచం డబ్బు రూ.10 వేలను తీగల రాజేష్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో సైదాపూర్ మండల సర్వేయర్ యెక్కలదేవి కుమారస్వామితో పాటు అతని ప్రైవేట్ సహాయకులు తీగల రాజేష్, వంగా విహిత్ రెడ్డిలను అరెస్టు చేసి కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
హెల్ప్‌లైన్
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు.
