UPI ఛార్జీలపై సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: రూ.2,000కు పైబడిన వాణిజ్య (Commercial) UPI లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ జే.వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. UPI ప్రవేశపెట్టిన తర్వాత నగదు, బ్లాక్ మనీ లావాదేవీలు తగ్గాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వెంకట్రామన్ వాదనలు వినిపిస్తూ.. ఈ విధానం అమలుకు సంబంధించిన తొలి దశ అక్టోబర్ 15న ప్రారంభమవుతుందని తెలిపారు. UPI గేట్వేలను ఉపయోగించే వారిలో 96 శాతం మందికి మినహాయింపు ఉంటుందని వివరించారు. ఇది పన్ను లేదా ప్రభుత్వ రుసుము కాదని, UPI లావాదేవీల్లో పాల్గొనే సంస్థల మధ్య జరిగే సెటిల్మెంట్ ఛార్జీ అని స్పష్టం చేశారు. ఈ మొత్తంలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోదని తెలిపారు.
డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలకు సేవా వ్యయం ఉన్నట్లే UPI లావాదేవీలకూ ఖర్చు ఉంటుందని కేంద్రం తరఫు న్యాయవాది వివరించారు. NPCI ఈ లావాదేవీల సెటిల్మెంట్ ప్రక్రియను సమన్వయం చేస్తుందని తెలిపారు.
అయితే ఛార్జీ స్వరూపం, దాని చట్టపరమైన ఆధారం వంటి అంశాలపై ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. తదుపరి విచారణలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
