‘ప్రజావాణి’లో సైదాపూర్ అన్నదాతల వినూత్న వినతి
ఇరిగేషన్ కార్యాలయం ఆచూకీ తెలియక రైతుల అవస్థలు.. అధికారులకు ఫిర్యాదు

హుజూరాబాద్/సైదాపూర్, సెప్టెంబర్ 21: “మా సమస్యలు చెప్పుకుందామంటే మండలంలో ఇరిగేషన్ కార్యాలయమే కనిపించడం లేదు.. దయచేసి మా కార్యాలయం ఎక్కడుందో వెతికిపెట్టండి సారూ!” అంటూ సైదాపూర్ మండలానికి చెందిన రైతులు అధికారులను కోరారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలువురు రైతులు హాజరై ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
సైదాపూర్ మండల కేంద్రంలో కరీంనగర్ డివిజన్-2 పరిధిలోని ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయానికి బోర్డు, స్పష్టమైన చిరునామా లేకపోవడంతో సాగునీటి సమస్యలను ఎవరికి తెలియజేయాలో అర్థంకాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. కాలువల మరమ్మతులు, నీటి విడుదల తదితర సమస్యలపై దరఖాస్తులు సమర్పించేందుకు ప్రయత్నించినా అధికారుల జాడ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత డీఈఈని సంప్రదిస్తే హుజూరాబాద్ బస్టాండ్ వద్ద కార్యాలయం ఉందని ఒకసారి, కేసీ క్యాంపు వద్ద ఉందని మరోసారి చెబుతున్నారని రైతులు ఆరోపించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆరా తీస్తే కార్యాలయం అక్కడ లేదని స్థానికులు చెబుతున్నారని పేర్కొన్నారు. చిన్నపాటి సాగునీటి సమస్య వచ్చినా కరీంనగర్‌కు వెళ్లాల్సి వస్తోందని, అక్కడి నుంచి అనుమతులు వచ్చేలోగా కాలయాపన జరిగి పంటలకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అంశంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని రైతులు కోరారు. సైదాపూర్ మండల కేంద్రంలోనే ఇరిగేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, అధికారులు రైతులకు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో రైతులు గడ్డం విశాల్, మొలుగు రమేశ్, కుమార్, యాదగిరి తదితరులు ఉన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
