ఈనెల 13న ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమం
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ వినూత్న కార్యక్రమం

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. “స్వచ్ఛ పాఠశాల” పేరుతో ఈనెల 13న పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను పరిశుభ్రం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు మంగళవారం కరీంనగర్‌లోని చైతన్యపురిలో జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులతో సమావేశమైన బండి సంజయ్, మోదీ పాలన 12 ఏళ్ల సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పాఠశాలలు ఈనెల 15 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందుగానే అన్ని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేసి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈనెల 10న మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి, ప్రతి పాఠశాలకు ఇన్చార్జీలను నియమించాలని ఆదేశించారు. అలాగే 11, 12 తేదీల్లో బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో “టిఫిన్ బైఠక్” పేరుతో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి తరగతి గదికి ఇద్దరు కార్యకర్తలను కేటాయించి, 13న తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాలను శుభ్రం చేయాలని సూచించారు. అవసరమైతే చీపుర్లు, క్లాత్‌లు తీసుకెళ్లి పాఠశాలలను సుందరంగా ముస్తాబు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
అలాగే ఈనెల 16న “మీ పిల్లలను పాఠశాలల్లో చేర్పించండి” అనే నినాదంతో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు “మోదీ గిఫ్ట్” పేరుతో ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఒకేసారి, ఒకే సమయంలో వేలాది మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించేలా ప్రయత్నాలు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మంచి సందేశం వెళ్లేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఉదయం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.
