జూన్ 5 నుంచి కొత్త భూముల మార్కెట్ విలువలు అమలు
శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా సవరణలు చేపట్టాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్, జూన్ 3 : రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం మేరకు సవరించిన కొత్త భూముల మార్కెట్ విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం నివేదిక, ఉన్నతాధికారుల సలహాలు, క్షేత్రస్థాయి అధ్యయనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి కొత్త విలువలను నిర్ణయించినట్లు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22లో సమగ్ర అధ్యయనం లేకుండానే ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు భూముల ధరలు పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందని విమర్శించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ ధరల కంటే తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా విలువలు నిర్ణయించబడినట్లు పేర్కొన్నారు.
భూ లావాదేవీలలో ఏర్పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పునర్విమర్శ చేపట్టామని తెలిపారు. గ్రామీణ, పట్టణ కమిటీలు స్థానిక పరిస్థితులను పరిశీలించి సవరించిన విలువలను రూపొందించి ఆమోదించాయని వెల్లడించారు.
ప్రాంతాల అభివృద్ధి, వృద్ధి రేటు, భూముల వేలాలు, డిమాండ్, కొత్త రహదారులు, ORR, RRR, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మార్కెట్ విలువలను నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.
ఫ్లాట్ల విషయంలో గతంలో ఏర్పడిన అసమానతలను తొలగిస్తూ కొన్ని ప్రాంతాల్లో అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేసి మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్లు తెలిపారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదన్నారు.
నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు పెరిగిన నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్సీసీ, నాన్-ఆర్సీసీ నిర్మాణాల రేట్లను కూడా సవరించినట్లు వెల్లడించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ సవరణలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, భూ లావాదేవీల్లో పారదర్శకత పెంపునకు, ప్రభుత్వ ఆదాయ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
