టేకుమట్ల, ఏప్రిల్ 27:జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన అంబాల పోషాల కుమారుడు రాజేందర్ (వయసు అంచనా 35) శనివారం వడదెబ్బతో మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే, రాజేందర్ ఇంటి వద్ద స్పృహ కోల్పోయి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే చిట్యాల ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రేకుల షెడ్డు ఇంట్లో నివాసం ఉండటం వల్ల తీవ్ర వేడి ప్రభావంతో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
రాజేందర్ మృతితో అతని భార్య (వికలాంగురాలు), ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అనాధలుగా మిగిలారు. దహన సంస్కారాలకు ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో, గ్రామస్తులు మరియు దాతల సహాయంతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రస్తుతం మృతుడి కుటుంబం దారుణ స్థితిలో ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
