జమ్మికుంట: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ శుక్రవారం రోజున వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా హాజరు పట్టికలు, రికార్డులు పరిశీలించిన ఆయన, వేసవి కాలానికి అవసరమైన మందుల నిల్వలు, కుక్క కాటు మందుల ఉనికిపై సమీక్ష చేశారు.
లేబరేటరీ, ఎన్సీడీ క్లినిక్‌లను సందర్శించిన డాక్టర్ వెంకటరమణ, రక్తపోటు మరియు డయాబెటిస్ రోగుల రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలపై అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.
లేబర్ రూమ్‌ను పరిశీలించిన ఆయన, కలెక్టర్ సూచనల మేరకు ప్రతి పీహెచ్సీలో మొదటి కానుపులను ప్రభుత్వ నార్మల్ డెలివరీలుగా నిర్వహించాలని, తద్వారా సిజేరియన్ శాతం తగ్గించాలని సూచించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద అన్ని అవుట్ రీచ్ కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి, మహిళలందరికీ స్క్రీనింగ్ పూర్తి చేయాలన్నారు.
ఈ తనిఖీలో వావిలాల వైద్యాధికారి డాక్టర్ రాజేష్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
