కరీంనగర్-తిరుపతి (12762/12761) రైలు ప్రస్తుతం వారానికి రెండుసార్లు మాత్రమే నడుస్తుండగా, దీనిని ప్రతిరోజూ నడిపించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో ఉత్తర తెలంగాణ ప్రజలకు తిరుపతి వెళ్లేందుకు అనువుగా ఉండాలని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ రైలును ప్రారంభించానని ఆయన గుర్తు చేశారు. అయితే, గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వానికి, రైల్వే శాఖ మంత్రికి ఈ రైలును ప్రతిరోజూ నడిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తుల ప్రయాణ సౌలభ్యం కోసం కరీంనగర్-తిరుపతి రైలును నిత్యం నడిపేలా చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ మళ్లీ డిమాండ్ చేశారు.
