హుజూరాబాద్, జూన్ 10 – జిందగీ 9 న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ విగ్రహాల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నిర్ణయంపై సామాజికవేత్త కాశెట్టి కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
“రూ. 250 కోట్లు అవసరమా?” అనే ప్రశ్నను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఒక్కో విగ్రహానికి రూ. 25 లక్షలు ఖర్చవుతాయని, మొత్తం వ్యయం రూ. 250 కోట్లు అయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలు నిలిపివేయడం, అప్పుల భారం పెరగడం వంటి పరిస్థితుల్లో ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు.
“బతికున్న వారికి విగ్రహాలా?” అంటూ తీవ్రంగా స్పందించిన కాశెట్టి కుమార్, ప్రభుత్వాన్ని ధ్వజమెత్తారు. “మిస్ వరల్డ్ పోటీలపై ఖర్చులు పెట్టడం, ఇప్పుడు విగ్రహాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేయడం — ఇది ప్రజాధన దుర్వినియోగమే” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలే ఈ ప్రతిపాదనపై తనను సంప్రదించి అభ్యంతరం తెలిపారని కుమార్ పేర్కొన్నారు. విగ్రహాల ఏర్పాటు సంప్రదాయాలకు విరుద్ధమని, ప్రజలు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
రూ. 250 కోట్లు ఇలా వినియోగించాలి అని సూచన:
పేద పిల్లల విద్యాభివృద్ధికి
అర్హులైన వారికి పెన్షన్ల కోసం
ప్రాధాన్య రంగాల పురోగతికి
అలాగే, దేశానికి సేవ చేసిన స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, భగత్ సింగ్ వంటి మహనీయుల విగ్రహాలే ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
“విగ్రహం పెడితే, ప్రతి విగ్రహం పక్కన తెలంగాణ ఉద్యమకారుడి ఫోటో ఉండాలి” అని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రజా అభిప్రాయంతోపాటు ఈ ప్రతిపాదనను పునఃసమీక్షించాలని, ప్రభుత్వానికి హితవు పలికారు.

