జమ్మికుంట, ఫిబ్రవరి 12, 2025:”రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి విచారకరం. రాజ్యాంగ పరంగా ఆలయాన్ని నిర్వహిస్తున్న ఓ పూజారిపై భౌతిక దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ఇది మతోన్మాద సంస్కృతికి సంకేతంగా మారిందని మేము ఖండిస్తున్నాం,” అని మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలిపింది.
“తమను శ్రీరాముని వంశానికి చెందినవారని చెప్పుకున్న కొందరు వ్యక్తులు, రామరాజ్యం స్థాపన కోసం ఆర్థిక సహాయం చేయాలని, వారి శ్రీరామ సైన్యంలోకి ఇక్ష్వాకు వంశస్తులను రిక్రూట్ చేయాలని రంగరాజన్‌ను డిమాండ్ చేశారు. అయితే, ఆయన నిరాకరించడంతో భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య. ఇలాంటి ఘటనలు సమాజంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మారుతున్నాయి,” అని వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
“ఈ ఘటనపై మేము ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరుతున్నాం. దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలి. అంతేకాదు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హిందూ ధర్మం పేరుతో రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పనిచేసే సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. మత సామరస్యాన్ని దెబ్బతీసే వ్యక్తులపై ప్రత్యేక చట్టాలు రూపొందించి కట్టడి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం,” అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డా. ఎస్. తిరుపతయ్య పేర్కొన్నారు.
“ఇంతకాలం అనేక సంస్థలు సృష్టించిన మతోన్మాద వాతావరణం, ప్రైవేట్ సైన్యాల రూపంలో పెరిగిపోతోంది. ఇది భవిష్యత్‌కు ప్రమాదకరం. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే, ఇలాంటి సంస్కృతికి తెరపడాల్సిందే,” అని వేదిక అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు పేర్కొన్నారు.
