
13వ, 27వ డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ ఇంటింటి ప్రచారం
కరీంనగర్లో అంబటి జోజిరెడ్డి నేతృత్వంలో జోరు
కరీంనగర్, ఫిబ్రవరి 5 (2026):
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నగరంలో జోరుగా ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర కన్వినర్ అంబటి జోజిరెడ్డి నేతృత్వంలో 13వ, 27వ డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్‌తో కలిసి, 13వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పెంట స్వరూప సత్యం, 27వ డివిజన్ అభ్యర్థి శ్యామల కిరణ్ వెంట వెళ్లి ఓటర్లను నేరుగా కలుసుకుని పార్టీ విధానాలను వివరించారు. సింహం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాల్సిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రజారంగ సంస్థల ప్రైవేటీకరణ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ రెండు ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు విసిగిపోయారని, ప్రజల సమస్యలపై నిజంగా పోరాడే పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ పరిస్థితుల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థి పెంట స్వరూప సత్యాన్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. 13వ, 27వ డివిజన్ల అభివృద్ధికి ఫార్వర్డ్ బ్లాక్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని తెలిపారు.
కరీంనగర్ నగరంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రోజురోజుకీ ప్రజల మద్దతు పెరుగుతోందని, ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించే దిశగా పార్టీ బలంగా అడుగులు వేస్తోందని అంబటి జోజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, ముత్యాల విజయ్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
