
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని జగ్గయ్యపల్లి – వల్బాపూర్ మధ్య రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం ముప్పుగా మారింది. పెళ్లికి హాజరవడానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుటుంబం ప్రమాదానికి గురైంది. ఆదివారం సుమారు రాత్రి 8:30 గంటల సమయంలో, రైతులు రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని గమనించలేకపోవడంతో బైకు అదుపుతప్పి పడిపోయింది.
ఈ ఘటనలో భర్త, భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న జమ్మికుంట 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురినీ హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇలాంటి ధాన్యం ఆరబెట్టే నిర్లక్ష్య చర్యలు అమాయకుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల జోక్యం అవసరమని అభిప్రాయపడుతున్నారు.
