
ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. గురువారం జమ్మికుంటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంటలు కోయించినా కాంటాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం మిల్లుల్లో రోజులు తిరిగినా దింపుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్‌కు 8 కేజీల తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సన్న వడ్లకు ప్రకటించిన రూ. 500 లు బోనస్ మొత్తం రైతులకు అందలేదని గుర్తుచేశారు. రెండు లక్షల రుణమాఫీ పెండింగ్‌లోనే ఉందని, వర్షాలు–తుఫానుతో నష్టపోయిన రైతులకు ప్రకటించిన రూ.10,000 లు పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పత్తి కొనుగోళ్లలో ఆలస్యం చేయకుండా 7 క్వింటాళ్ల నిబంధన లేకుండా కొనుగోళ్లు ప్రారంభించాలని, వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సీసీఐ నిబంధనలు సడలించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా సకాలంలో చెల్లించి ఉంటే రైతులు ఇన్ని ఇబ్బందులు పడేవారని వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ మనదే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారే మెజారిటీ సాధిస్తారని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జీపీటీసీలలో అధిక శాతం తమవారేనని, రెండు మున్సిపాలిటీల్లో బూతు స్థాయిలో పటిష్టంగా పని చేసి విజయం సాధిస్తామని తెలిపారు. త్వరలోనే నాయకులు, కార్యకర్తలతో స్ట్రాటజీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
హుజూరాబాద్ ప్రజలపై ఈటల భావోద్వేగ వ్యాఖ్యలు
హుజూరాబాద్ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తుచేసిన ఈటల, 4 లేన్ రోడ్లు, సబ్ స్టేషన్లు, చెక్‌డ్యామ్‌లు, కమలాపూర్ ఎడ్యుకేషన్ హబ్ వంటి పనులు ప్రజలకే స్పష్టమని పేర్కొన్నారు. “మీడియా లేదా సోషల్ మీడియాను కాదు… ప్రజలను, ధర్మాన్ని, పనిని నమ్ముకున్న వాడిని” అని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికి నాపై ధర్నా చేసిన వారు ఇప్పుడు రెండేళ్లు గడిచినా ఏం చేశారో చెప్పాలని సవాలు విసిరారు.అబద్ధాలతో రాజకీయాలు చేసే వారిని ప్రజలే బుద్ధి చెప్తారని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
