
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ అమలు
మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో నిషేధాజ్ఞలు
కరీంనగర్, ఫిబ్రవరి 15, 2026: మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఉప మేయర్ మరియు మున్సిపాలిటీల చైర్మన్, ఉప చైర్మన్ పరోక్ష ఎన్నికలు ఫిబ్రవరి 16న జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ (గతంలో సెక్షన్ 144) నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకువచ్చినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శాంతిభద్రతలు పరిరక్షించేందుకు, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటం నిషేధించబడింది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 16 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 17 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి.చట్టబద్ధమైన సమావేశాలు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, సైనిక సిబ్బంది, హోంగార్డులు, అంత్యక్రియల ఊరేగింపులు, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వైద్య మరియు అత్యవసర సేవలకు ఈ నిషేధాజ్ఞల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.మున్సిపల్ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగియాలంటే ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసు యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
