తెలంగాణ రైతులకు మౌంట్ అబూలో శాశ్వత యోగిక్ అగ్రికల్చర్ శిక్షణ
వనపర్తి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ సహకారంతో రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ అబూ నగరంలో శాశ్వత యోగిక్ అగ్రికల్చర్ పై ప్రత్యేక శిక్షణా శిబిరం 3 ఏప్రిల్ 2025 నుండి 6 ఏప్రిల్ 2025 వరకు నిర్వహించబడింది. ఈ శిక్షణలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి ఒకరు లేదా ఇద్దరు చొప్పున మొత్తం 45 మంది రైతులు పాల్గొన్నారు. వీరితో పాటు వ్యవసాయ శాఖ నుండి ఇద్దరు అధికారులు, బ్రహ్మ కుమారీస్ సంస్థ గైడ్లు సహా మొత్తం 54 మంది ఈ శిబిరంలో పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ శిక్షణకు ఎంపిక కావడం విశేషం. ఈ బృందం ఏప్రిల్ 1న బయలుదేరి, మౌంట్ అబూకు 3వ తేదీన చేరుకుంది. శిక్షణ అనంతరం 7వ తేదీన తిరుగు ప్రయాణం ప్రారంభించి, 8వ తేదీన రాష్ట్రానికి చేరుకుంది.
శిక్షణా శిబిరంలో ప్రధానంగా రైతులకు క్రిమిసంహారకాలు, రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలు, ప్రకృతి కాలుష్యం, ఆహారంలో విషతత్వం పెరుగుదల, తద్వారా మానవ ఆరోగ్యం పై పడే ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఇవి నివారించేందుకు ప్రకృతి అనుగుణంగా సాగు చేయడం, స్వయం విత్తన తయారీ, భూమి సంస్కరణ, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, సూక్ష్మజీవుల పెంపకాన్ని ప్రోత్సహించే పద్ధతులు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.
అదే విధంగా, దశపత్ర కషాయం, గోకృప యోగామృతం, గోవు ఆధారిత వ్యవసాయం, పంట మార్పిడి, మల్టీ లేయర్ సాగు వంటి సాంకేతికతల ద్వారా అధిక దిగుబడులు సాధించగల మార్గాలను రైతులకు తెలియజేశారు.
రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు యోగ, ధ్యానం, నిశ్చింత జీవనవిధానం గురించి కూడా శిక్షణ ఇచ్చారు. “రైతులు కృషి నుండి ఋషిగా మారి, ప్రపంచానికి విషాహారాన్ని కాకుండా స్వచ్ఛమైన ఆహారాన్ని అందించే రాజులు కావాలి” అనే సందేశాన్ని స్ఫూర్తిదాయకంగా రైతులకు వివరించారు. శిక్షణ ముగింపు సందర్భంగా పాల్గొన్న రైతులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన గాఢమైన అవగాహన కల్పించబడినట్లు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
