
జమ్మికుంటలో స్నేహిత కార్యక్రమం – బాలికల రక్షణ, హక్కులపై అవగాహన
జమ్మికుంట: జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈరోజు జమ్మికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరుణ ఆధ్వర్యంలో “స్నేహిత కార్యక్రమం” నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు మాట్లాడుతూ, స్నేహిత కార్యక్రమం విద్యార్థులలో, ముఖ్యంగా బాలికలలో చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడం, స్వీయ రక్షణ భావన పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు మంచి, చెడు స్పర్శల మధ్య తేడాను అర్థం చేసుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రతి పాఠశాలలో స్నేహిత ఫిర్యాదు పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ పెట్టెను షీ టీమ్ బృందాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. బాలికల రక్షణలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులంతే బాధ్యత వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి. సురేష్‌బాబు, హెల్త్ ఎడ్యుకేటర్లు పంజాల ప్రతాప్‌గౌడ్, మోహన్‌రెడ్డి, ఐసిడీఎస్ సూపర్వైజర్ సాయి అపూర్వ, డిసిపియు కౌన్సిలర్ తేజస్వి, ఏపిఎం కొమురయ్య, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
