హుజురాబాద్: ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని 60 వార్డులు, 107 గ్రామాల్లో ఎలాంటి నీటి సమస్య తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు.
శనివారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మిషన్ భగీరథ అధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే మొదలైంది అని, తెలంగాణ ఏర్పాటుకు తర్వాత ప్రజలకు తాగునీటి సమస్య రాకూడదనే లక్ష్యంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు దక్కుతుందని అన్నారు.
తెలంగాణ రైతులకు సాగు నీరు అందించేందుకు కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వం మన్ననీయమైన పనులు చేసింది అని ఆయన పేర్కొన్నారు. 60 ఏళ్ల పాలనలో నీటి కోసం గోసపడ్డ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా మారుస్తూ సస్యశ్యామలం చేసింది అని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఎండాకాలం కావడంతో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు నీటి పరిస్థితిని సమీక్షించి, తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ డీలు బాలరాజు, శ్రీనివాస్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
