అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు: కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

జూలూరుపాడు, జూలై 17 (జిందగీ9న్యూస్):
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచినపేట గ్రామంలో కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ఇండ్లలో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. వాటిలో భాగంగా సుమారుగా రూ. 4,000 విలువ చేసే గుడుంబా, రూ. 15,000 విలువైన మద్యం బాటిళ్లు, రూ. 3,500 విలువ గల గుట్కా ప్యాకెట్లు సీజ్ చేశారు. అదనంగా సరైన పత్రాలు లేని 65 వాహనాలపై రూ. 8,900 జరిమానా విధించారు.
అలాగే నిషేధిత పదార్థాలైన గంజాయి లాంటి మత్తు వస్తువుల కోసం నార్కోటిక్ డాగ్స్ సాయంతో తనిఖీలు జరిపినట్లు డిఎస్పీ తెలిపారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ, “చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వ్యక్తులపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి,” అని స్పష్టం చేశారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా లాంటి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
