
అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుకలు
కరీంనగర్లోని రేకుర్తిలో ఉన్న ప్రైవేట్ వేడుక మందిరంలో అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్, గర్ల్స్ టెక్నో స్కూల్, టైనీ టాట్స్ పాఠశాలల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం “సయిరి” పేరిట ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో తప్పనిసరిగా లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ క్రమం తప్పకుండా సాధన చేస్తే పరీక్షల్లో విజయం సులభమవుతుందని తెలిపారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు సరస్వతి దేవి విగ్రహానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులకు పరీక్షల్లో జాగ్రత్తలు పాటిస్తూ అద్భుత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న నరేందర్ రెడ్డిని పదవ తరగతి విద్యార్థులు ఘనంగా సత్కరించగా, వారికి మార్గదర్శకత్వం అందిస్తున్న ఉపాధ్యాయులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
