త్వరలో ఎంపీడీవో కార్యాలయం ముట్టడి – బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు హెచ్చరిక
జూలూరుపాడు, జూన్ 18 (Zindagi9News):
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు న్యాయం జరగడం లేదని, జాబితా తయారీ వ్యవహారంలో అనేక అసమర్థతలు చోటు చేసుకున్నాయని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లకావత్ గిరిబాబు ఆరోపించారు.
బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిబాబు మాట్లాడుతూ, “ఇల్లు లేని పేదలకు కాకుండా, కిరాయినివాసాల్లో ఉండే వారికి కాకుండా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం అర్హులను పక్కన పెడుతున్నారు,” అని విమర్శించారు.
ఇల్లు మంజూరులో అసలు లబ్ధిదారులకు న్యాయం జరగకపోవడంతో పాటు, కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా కూడా తమ వర్గానికి చెందినవారే ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు.
జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు వెంటనే జోక్యం చేసుకొని, పూర్తిగా అర్హులకే ఇండ్ల పథకాలు & రాజీవ్ యువ వికాస్ మంజూరు చేయాలని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అధికారులను ఒత్తిడి చేయొద్దని గిరిబాబు స్పష్టం చేశారు.
గునుకులపల్లె గ్రామంలో ఎంపికైన ఓ లబ్ధిదారుడి ఇంటికి బిల్లు మంజూరు చేయకుండా అడ్డుకుంటున్నారని, 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగుల నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అర్హులకు ఇళ్లు మంజూరు చేయకపోతే త్వరలోనే ఎంపీడీవో కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.

