బోయినిపల్లి, ఏప్రిల్ 3: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో నివసించే టేకు శంకరయ్య – పద్మ దంపతుల పూరిగుడిసె గురువారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఫ్యాన్, బీరువా, మంచాలు, దుస్తులు సహా నగదు, బంగారు-వెండి ఆభరణాలు పూర్తిగా కాలి పోయాయి.
విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఘటనాస్థలికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే ₹5,000 ఆర్థిక సహాయం అందజేస్తూ, ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
అదేరోజు బోయినిపల్లి మండల కేంద్రంలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝను సంఘటన స్థలానికి తీసుకువచ్చి బాధిత కుటుంబ స్థితిగతుల్ని వివరించారు. పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్, ₹50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఈ సందర్భంగా బాధితురాలు పద్మ మాట్లాడుతూ, “పేద కుటుంబమైన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణ సాయం అందించడంతో పాటు కలెక్టర్ ద్వారా ఎక్స్గ్రేషియా మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.
