బోయినిపల్లి, ఏప్రిల్ 3:కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం బోయినిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి పూలబొకే ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు.
సన్న బియ్యం పై అధికారులకి స్పష్టమైన సూచనలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రభుత్వం ప్రజలకు మంచి ఆహారం అందించాలని ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. మండలంలో 33,141 లబ్ధిదారులు ఉన్నారు. అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సన్న బియ్యం అక్రమ రవాణా జరగకుండా రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖలు సమర్థంగా చర్యలు తీసుకోవాలి” అని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో బియ్యం పరిస్థితి – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, “గత పదేళ్ల పాలనలో ప్రజలు దొడ్డు బియ్యం తినలేక అమ్ముకునే పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం, రెండు లక్షల రుణమాఫీ, ఉచిత కరెంటు వంటి పథకాలను అమలు చేస్తోంది. అలాగే, సన్న బియ్యం అందించి లబ్ధిదారులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తోంది” అని అన్నారు.
అంతేకాదు, “గతంలో సీఎం కేసీఆర్ ‘వరి వేస్తే ఉరి’ అన్న మాట చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించి రైతులను ఆదుకుంటోంది. ఇది బి.ఆర్.ఎస్ నాయకులు గుర్తించాలి” అని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు:
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, తహశీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ జోగినిపల్లి వెంకట రామారావు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనుముల హరికృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
