జనగామ జిల్లా, పాలకుర్తి మండలం: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందిన ఘటన పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీ నారాయణపురం గ్రామానికి చెందిన యాట అర్చన (22) అనే గర్భిణీ, మొదటి కాన్పు కోసం రెండు రోజుల క్రితం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిన వైద్యులు, మూడు రోజుల తర్వాత గర్భిణీ పరిస్థితి విషమించడంతో వేరే ఆసుపత్రికి తరలించమని సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో పసికందు మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ, గర్భిణీ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
