హైదరాబాద్, మార్చి 24, 2025:తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఇండియానా రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వివరించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో “ఇండియానా సెక్రటరీ ఆఫ్ స్టేట్” డియెగో మోరాలెస్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రిని కలుసుకుని ద్వైపాక్షిక పెట్టుబడుల అవకాశాలపై చర్చించింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. పారిశ్రామిక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది” అని అన్నారు.
పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తెలంగాణ
గత కొన్నేళ్లలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో కీలక కేంద్రంగా ఎదిగిందని మంత్రి తెలిపారు. “ఈ ఏడాది దావోస్ పర్యటనలో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరాయి. తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ హబ్‌గా మారుతోంది” అని పేర్కొన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎలీ లిల్లీ వంటి ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నాయని వివరించారు.
పరిశ్రమలు – విద్యా సంస్థల అనుసంధానం
ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ” ను ప్రారంభించినట్లు తెలిపారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించి నాణ్యమైన మానవ వనరులను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు.
ఇండియానా-తెలంగాణ సంబంధాలకు నూతన దిశ
మెడికల్ డివైజెస్, బయోటెక్, ఫార్మా, వ్యవసాయం, తయారీ రంగాల్లో ఇండియానా రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ సందర్భంగా ఇండియానా సెక్రటరీ ఆఫ్ స్టేట్ డియెగో మోరాలెస్, “తెలంగాణతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తమ రాష్ట్రంలో మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డియెగో మోరాలెస్ సతీమణి సిడోనియా నికోల్, సోజోస్ క్యాపిటల్ సీఈఓ ఫాబియో పెరేజ్ పెరేయ్రా, ఇండియానా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు రాజు చింతల, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, టీజీఐఐసీ సీఈఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
