కరీంనగర్: డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ డీలిమిటేషన్ పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
డీలిమిటేషన్ పై అవగాహన లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్
సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “డీలిమిటేషన్ ప్రక్రియపై బండి సంజయ్‌కు కనీస అవగాహన లేదు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన కేంద్ర మంత్రులు సైలెంట్‌గా ఉండటం బాధాకరం” అని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ లొసుగులు బయటపడ్డాయి
“ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఠాతో బీజేపీ ఒప్పందం చేసుకుందో ప్రజలందరికీ అర్థమైంది. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. కేసుల భయంతోనే బీజేపీకి లొంగిపోయింది” అని ధ్వజమెత్తారు. “కేసీఆర్, మోదీకి భయపడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరెండర్ అయ్యారని” తీవ్ర విమర్శలు చేశారు.
జీడీపీ & డీలిమిటేషన్ మధ్య సంబంధం – దక్షిణాదికి అన్యాయం
“దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీలో 36% వాటా కలిగి ఉన్నప్పటికీ, జనాభా పరంగా కేవలం 19% మంది మాత్రమే ఉన్నారు. జనాభా ఆధారంగా కాకుండా, ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు సీట్ల విభజన చేయాలి” అని డిమాండ్ చేశారు.
“డీలిమిటేషన్ విధానంతో అధికారం కేంద్రీకృతమై, నాలుగు రాష్ట్రాలే దేశాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ఇది దక్షిణాదికి తీవ్ర అన్యాయం” అని స్పష్టం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలకు 33% పార్లమెంటు సీట్లు ఇవ్వాలి
543 సీట్లున్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది వాటా 24% (130 సీట్లు) మాత్రమే ఉందని, కొత్త డీలిమిటేషన్ తర్వాత మొత్తం సీట్లు 815 అయితే, దక్షిణాదికి కనీసం 33% అంటే 272 సీట్లు రావాల్సిందే అని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
“జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే సహించం. న్యాయపరమైన, సమతుల్యమైన విభజన కావాలి” అని హితవు పలికారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
