పల్లె దవాఖానలకు మోక్షం ఎన్నడు?
పూర్తయిన భవనాలు.. ఇంకా తలుపులు తెరుచని వైద్య కేంద్రాలు
బోయినిపల్లి, ఏప్రిల్ 8 (జిందగీ9న్యూస్):
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో పల్లె దవాఖానాలు నిర్మించినా, అవి ప్రారంభం కాని పరిస్థితులు కొనసాగుతుండటం గ్రామీణ ప్రజలను నిరాశకు గురిచేస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంతో పాటు వరదవెల్లి, కొదురుపాక గ్రామాలలో పల్లె దవాఖానాల నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ అవి ప్రారంభం కాలేదు. పిచ్చిమొక్కలు పెరిగిపోతుండగా, భవనాలు నిరుపయోగంగా మిగులుతున్నాయి. ప్రజలు ఎప్పటినుంచో ఈ దవాఖానల ప్రారంభాన్ని ఎదురుచూస్తున్నారు.
బోయినిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో రెండు సబ్ సెంటర్లు, కొదురుపాక పరిధిలో రెండు, విలాసాగర్ పరిధిలో మూడు సబ్ సెంటర్లు కొనసాగుతున్నాయి—మొత్తం అద్దె భవనాల్లోనే. దీంతో సరైన వసతుల్లేక ఆరోగ్య సేవల నాణ్యతపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పల్లె దవాఖానాలు పూర్తయ్యినప్పటికీ విద్యుత్, నీటి వంటి ప్రాథమిక సదుపాయాలు ఇప్పటివరకు సిద్ధం కాలేదు. కొందరు ప్రజలు ఈ దవాఖానాలను ప్రజలకు అందుబాటులో ఉండే కేంద్రాల్లో నిర్మించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
