పరిమితిని మించి తవ్వుతున్న కంకర్ మిల్లు – బ్లాస్టింగ్లతో ప్రజలకు నిద్రలేని రాత్రులు

వైరా , అక్టోబర్ 08 ( zindagi9news రిపోర్టర్ : రాము నాయక్) : ఏన్కూర్ మండల పరిధిలోని గార్లఒడ్డు గ్రామం వద్ద ఉన్న కంకర్ మిల్లు నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణిపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మైనింగ్ శాఖ అనుమతించిన పరిమితిని మించి లోతుగా తవ్వకాల జరుపుతున్నారని, అలాగే అధిక స్థాయిలో బ్లాస్టింగ్లు నిర్వహించడం వల్ల గ్రామంలో అనేక ఇళ్లకు చీల్లు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు పొలాల్లోకి ఎగురుతూ రైతుల పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. రాళ్లు తాకి గోడలు పగలడమే కాక, కొన్ని ఇళ్లలో ఎల్ఈడి టీవీలు సైతం దెబ్బతిన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బ్లాస్టింగ్‌లో ఉపయోగించే కెమికల్ పదార్థాలు గాలిలో కలిసిపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో క్వారీ చుట్టుపక్కల పచ్చని వాతావరణంలో మేతకు వెళ్లే మేకలు, గొర్రెల మందలు క్వారీలో జారిపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. నీరు నిలిచిన క్వారీల్లో జంతువులు తాగటానికి వెళ్లి మరణిస్తున్న ఘటనలు గ్రామస్థులను కలచివేస్తున్నాయి.
అంతేకాకుండా, కంకర్ మిల్లుకు వెళ్లే రహదారి పంట పొలాల మధ్యగా ఉండటం రైతులకు కొత్త సమస్యగా మారింది. టిప్పర్లు అధిక వేగంతో తిరగడం వలన మట్టి గాలిలో ఎగసి పంటల మీద పడుతోంది. దాంతో పంట నష్టాలు సంభవిస్తున్నాయి. వాహనాల రాకపోకల వల్ల దారంతా గుంతలమయమై, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
గ్రామస్తులు పలుమార్లు సంబంధిత మైనింగ్ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల విజ్ఞప్తి – “ఇప్పటికైనా మైనింగ్ శాఖ కంకర్ మిల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఏకకంఠంగా కోరుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
