
ద్వారకపేటలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తత – కత్తి సుమలత సంపత్ కుటుంబంపై దాడి యత్నం
టేకుమట్ల మండలం ద్వారకపేట గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన కత్తి సుమలత సంపత్ స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామ సర్పంచ్ చెలకాని కళ, ఆమె భర్త రవి, కుమారుడు రాకేష్‌తో పాటు వారి అనుచరులు మద్యం మత్తులో డీజే సౌండ్ బాక్సులతో కత్తి సుమలత సంపత్ ఇంటి ఎదుటకు చేరుకుని కులాన్ని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటి తలుపులు, గేటును తన్నుతూ లోపలికి చొరబడి హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు బాధితులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టి శాంతి నెలకొల్పారు. సర్పంచ్ కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని కత్తి సుమలత సంపత్ పేర్కొంటూ, నిందితులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్, సర్పంచులు గునిగంటి మహేందర్ గౌడ్, నేరెళ్ల రామకృష్ణ గౌడ్, తోట సాగర్, సీనియర్ నాయకులు తోట గట్టయ్య, కొయ్యలు చిరంజీవి గౌడ్, పెసరు రాజేష్ గౌడ్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
