
జమ్మికుంటలో అత్యాధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో కేంద్రం గ్రీన్ సిగ్నల్
రూ.6.50 కోట్ల నిధుల మంజూరుకు పరిపాలనా అనుమతి
జమ్మికుంటలో అత్యాధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.
జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు (IAAF / World Athletics) అనుగుణంగా 4-లేన్, 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ఖేలో ఇండియా పథకం కింద చేపట్టనుండగా, ఇందుకు కేంద్ర ప్రభుత్వం తన వంతుగా రూ.6.50 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు యువజన అభివృద్ధి, పర్యాటకం & సంస్కృతి (క్రీడలు) శాఖ అండర్ సెక్రటరీ చంచల్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ పంపారు.
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులలోపు అంగీకారం తెలపాలి. అలాగే అవసరమైన భూమి అనుమతులు, అమలు సంస్థ ఎంపికను పూర్తి చేసి మూడు నెలల్లో టెండర్ ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది. ట్రాక్ నిర్మాణంలో అదనపు వ్యయం అవసరమైతే, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని విధివిధానాలు పూర్తైన తర్వాతే నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఇటీవల జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించగా, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. వాటిని పరిశీలించిన కేంద్ర యువజన, క్రీడల శాఖ ఖేలో ఇండియా పథకం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం విశేషం.
ఈ సింథటిక్ ట్రాక్ నిర్మాణంతో ఉత్తర తెలంగాణ యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల నిర్వహణకు మార్గం సుగమం కానుంది. గ్రామీణ ప్రాంతాల ప్రతిభకు జమ్మికుంట వేదికగా మారనుంది.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా భవిష్యత్ ఒలింపియన్లు, జాతీయ స్థాయి అథ్లెట్లను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి పరిపాలనా అనుమతి లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాల మేరకు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
