జమ్మికుంట మే 3 (zindagi9news) : మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం బేషరతుగా శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట వినాయక గార్డెన్స్‌లో శనివారం ఉదయం జరిగిన శాంతి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది.సభలో ప్రసంగించిన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 78 సంవత్సరాలయినా, రాజ్యాంగం అమలై 75 ఏళ్లు అయినా ప్రజలకు మౌలిక హక్కులు పూర్తిగా అందడంలేదన్నారు. “ఆహారం, నీరు, గాలి వంటి ప్రాథమిక అవసరాలకే ప్రజలు ఇంకా నష్టపోతున్నారు. ఆదివాసుల హక్కులు హరించబడుతున్నాయి. రాజ్యాంగం అందరికీ గౌరవప్రదమైన జీవితం హామీ ఇస్తుంది. ఇది మావోయిస్టులు, ఆదివాసులు, పోలీసులు అందరికీ వర్తిస్తుంది” అని తెలిపారు.మావోయిస్టులు తమపక్షంగా తుపాకులు వాడమని, చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కేంద్రం వారి పట్ల బలవంతపు దాడులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ‘‘ఇది రాజ్యాంగ ధర్మం కాదు. నైతికత, ఆధ్యాత్మికతకూ విరుద్ధం. కేంద్రం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరపాలి. చర్చల ముందు షరతులు విధించడం తగదు. చర్చల ప్రక్రియను నిష్పక్షపాతంగా ప్రారంభించాలి’’ అని సూచించారు.ఈ సదస్సులో వివిధ రాజకీయ పార్టీలు, విద్యా, ఉద్యోగ సంఘాలు, హక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు. చర్చలు ప్రారంభించాలనే తీర్మానాన్ని సభ ఆమోదించింది. సదస్సులో కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశిని కోటి, సదయ్య, టీఆర్ఎస్ నాయకులు పింగళి రమేష్, తక్కలపల్లి రాజేశ్వరరావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సిపిఐఎం నాయకుడు వాసుదేవరెడ్డి, మానవ హక్కుల వేదిక ప్రతినిధులు బదావత్ రాజు, హరికృష్ణ, పందిళ్ల రంజిత్ కుమార్ తదితరులు మాట్లాడారు. విద్యార్థి సంఘాల నాయకులు సజ్జు, ఇమ్రాన్, శిరీష, స్రవంతి పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
