పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అనేక మార్లు విజ్ఞప్తి చేసిన తర్వాతే నిన్న పర్యటనకు వచ్చిన ప్రభుత్వంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయని తెలిసిన తర్వాత కూడా మరో రెండేళ్ల గడువు పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
“ఏడాదిన్నర కాలంగా పాలమూరు ఎత్తిపోతల పథకంలో తట్టెడు మట్టికూడా ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోంది” అని విమర్శించారు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ఈ పనులను పట్టించుకోకపోవడం మాతృద్రోహమే అని అన్నారు.
ఉద్దండపూర్ తప్ప మిగిలిన నాలుగు పంప్ హౌస్‌లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, టన్నెళ్లు, సర్జ్ పూల్స్ అన్నీ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని తెలిపారు. నార్లాపూర్‌లో వెట్ రన్, మిగతా చోట్ల డ్రై రన్ కూడా పూర్తి చేశామని చెప్పారు.
ప్యాకేజీ-3 లో ఇంకా 8 కిలోమీటర్ల కాలువ మాత్రమే మిగిలిందని, దానికి ఆన్లైన్ కాంట్రాక్టు టీడీపీకి చెందిన వ్యక్తి చేతిలో ఉండటంతో పని ఆలస్యమవుతుందని అన్నారు. అక్కడి ప్రముఖుల ఒత్తిడితో పనులు నిలిచిపోయాయేమోనన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ కోసం 27 వేల ఎకరాల్లో వంద ఎకరాలు మినహా భూసేకరణ పూర్తయిందని, కానీ పాలమూరు ప్రాంతానికి ప్రయోజనం కలగకూడదనే దుష్ప్రయత్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఈ పథకం ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. డిండి లిఫ్ట్ ద్వారా నల్లగొండకు, వట్టెం రిజర్వాయర్ ద్వారా గ్రావిటీ ద్వారా నీరు తీసుకెళ్లవచ్చని సూచించామని తెలిపారు.
ఈ మార్గం ద్వారా రూ.80-100 కోట్లలోనే సాధ్యమవుతుందని, కానీ ప్రభుత్వం మాత్రం ఏదుల మార్గం ద్వారా నీళ్లు తీయాలని రూ.1800 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతుందని ఆరోపించారు. ఇందులో రూ.1300 కోట్లకు టెండర్లు కూడా పిలిచారని తెలిపారు.
