
కాకర్ల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కల తొలగింపు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31 (జిందగీ 9న్యూస్):
జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల నుంచి పడమటి నర్సాపురం వరకు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించారు.
గ్రామస్థులు, ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ రోడ్డుపై పెరిగిన పిచ్చిమొక్కల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిధులు లేవంటూ పట్టించుకోలేదని విమర్శించారు. “మాకు అన్నం పెట్టే ఆటోలకు ప్రమాదాలు జరిగితే మేమెలా జీవించగలం? అందుకే స్వతహాగా శ్రమదానం చేపట్టాం,” అని సభ్యులు తెలిపారు.
సుమారు నాలుగు కిలోమీటర్ల రహదారిని శుభ్రం చేసిన ఈ కార్యక్రమంలో కొండే రమేష్, గున్నం వెంకటేశ్వర్లు, నరసింహారావు, వెంకటప్పయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.
