హైదరాబాద్, మార్చి 7: రాష్ట్ర మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఉద్యోగుల వేతనాలను పెంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.
ఉద్యోగుల హక్కులను తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
బండి సంజయ్ మాట్లాడుతూ, “పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేయడం దారుణం. 2021లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30% వేతన పెంపు చేస్తామని ప్రకటించినప్పటికీ, నాలుగేళ్లుగా పెంపు కాలేదు. పైగా, ఇప్పుడు ఉన్న వేతనాల్లోనే భారీగా కోత విధించడం అర్ధరహిత నిర్ణయం.” అని ఆరోపించారు.
డ్రైవర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల వేతనాల్లో 25% తగ్గింపు
ఇప్పటివరకు శానిటరీ ఇన్స్పెక్టర్ల వేతనం ₹22,000 ఉంటే, దాన్ని ₹16,600కి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని బండి సంజయ్ పేర్కొన్నారు. మున్సిపల్ డ్రైవర్ల వేతనాలను కూడా ఇదే తరహాలో తగ్గించారని తెలిపారు. “ఇది ఉద్యోగుల జీవితాలతో చెలగాటం. పెంచాల్సిన వేతనాలను తగ్గించడం కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్య.” అని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత కూడా తీరు మారలేదా?
ఉద్యోగుల సంక్షేమం విస్మరించిన ప్రభుత్వానికి ప్రజలు, ఉద్యోగులు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్ హెచ్చరించారు. “ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి తగిన బుద్ధి చెప్పారు. అయినా ఇప్పటికీ తీరును మార్చుకోలేదు. ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలి.” అని అన్నారు.
తక్షణమే వేతనాలు పెంచాలి: బీజేపీ డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా 30,955 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారని, వీరి వేతనాల్లో కోత విధించడం కరెక్ట్ కాదని బండి సంజయ్ తెలిపారు. “ఉద్యోగుల జీతభత్యాలను పెంచడం పరిపాటి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అది చేయకపోగా, వేతనాల్లో కోత విధించడం అన్యాయం. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. శానిటేషన్ వర్కర్లు, డ్రైవర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల వేతనాలను తక్షణమే పెంచాలి.” అని డిమాండ్ చేశారు.
– Zindagi9News
