
తెలంగాణ రాష్ట్రంలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరోసారి విస్తృతంగా నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 12న మొత్తం ఆరు జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్‌గా పోలియో చుక్కలు వేయనున్నారు.
మన రాష్ట్రంలో చివరి పోలియో కేసు 2007లో నమోదవగా, దేశంలో చివరి కేసు 2011లో వెలుగులోకి వచ్చింది. గత మూడు సంవత్సరాలుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో మళ్లీ పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ఆయా దేశాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ జిల్లాలతో పాటు వరంగల్ పట్టణ ప్రాంతం కూడా ఎంపికైంది. ఈ ఆరు జిల్లాల్లో 0–5 సంవత్సరాల వయసున్న 17,56,789 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని అధికారులు తెలిపారు.
పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల వయసు ఉన్న ప్రతి చిన్నారికి ఈ డ్రైవ్‌లో పోలియో వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
