

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
కరీంనగర్: అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త C. V. Raman చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, భారత విజ్ఞాన రంగానికి రామన్ చేసిన సేవలు అపూర్వమని తెలిపారు. రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రపంచానికి భారత శాస్త్ర ప్రతిభను చాటారని పేర్కొన్నారు.
విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విశ్లేషణాత్మక దృక్పథంతో అభ్యసించాలని సూచించారు. దేశం సైన్స్ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోందని, యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
వేడుకలలో భాగంగా విద్యార్థులు సౌరశక్తి, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, సేంద్రియ ఎరువులు, పరిశుభ్రత ప్రాముఖ్యత తదితర అంశాలపై నమూనాలు ప్రదర్శించారు. రామన్ జీవిత విశిష్టతను తెలియజేసే నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
