కూలి పని పేరుతో మహిళపై దారుణం
బంగారం దోచుకుని బావిలో తోసేసిన నిందితుడు.. 21 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన బాధితురాలు

కరీంనగర్, జూలై 4(Zindagi9news): కూలి పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన ఓ మహిళపై దారుణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో వెలుగుచూసింది. ఈ కేసును కరీంనగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.
కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి (55) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే ఆమెను కుమారుడు సందీప్ కూలి అడ్డ వద్ద దింపాడు. ఈ సమయంలో కూలి పని ఉందని చెప్పి ఓ వ్యక్తి ఆమెను నుస్తులాపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె వద్ద ఉన్న అర తులం బంగారం, రూ.4 వేల నగదు దోచుకుని బావిలోకి తోసేశాడు.
బావిలో పడిన లక్ష్మి అక్కడ ఉన్న తాడును పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆ తాడును కూడా కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయినప్పటికీ బాధితురాలు ఈదుకుంటూ మోటారు పైపును పట్టుకుని దాదాపు 21 గంటల పాటు ప్రాణాలను కాపాడుకుంది.
రాత్రి వరకు తల్లి ఇంటికి రాకపోవడంతో కుమారుడు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం బావి వద్దకు వెళ్లిన భూ యజమానికి మహిళ కేకలు వినిపించడంతో గ్రామస్తుల సహాయంతో ఆమెను బయటకు తీశారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే ఉద్యోగాల పేరుతో అపరిచితులను నమ్మవద్దని, అక్రమ ఆన్లైన్ జూద యాప్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
