అల్ఫోర్స్లో హౌస్ ఎన్నికలు ఘనంగా ప్రారంభం విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం

కరీంనగర్, జూలై 4(Zindagi9news): స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్లో వార్షిక ప్రణాళికలో భాగంగా హౌస్ ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఎన్నికల ద్వారానే ప్రజలకు న్యాయం, అభివృద్ధి, వసతులు అందుతాయని అన్నారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో హౌస్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలోని విద్యార్థులను లక్ష్య, సరస్, తేజస్, ధ్రువ అనే నాలుగు హౌస్లుగా విభజించి కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు అభ్యర్థులు తమ గుర్తులతో ప్రచారం నిర్వహించి నిజమైన ఎన్నికల వాతావరణాన్ని తలపించారు. విద్యార్థులందరూ తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు.
ఓట్ల లెక్కింపును ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నట్లు, అనంతరం విజేతలతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
