కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రధానికి లేఖ
నీట్-యూజీ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం
విద్యార్థుల ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని లేఖలో పేర్కొన్న మంత్రి

న్యూఢిల్లీ, జూలై 25 (Zindagi9News): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విద్యార్థులను ఉద్దేశించి విడుదల చేసిన లేఖలో, గత నాలుగు దశాబ్దాలుగా విద్య, విద్యార్థులు, విద్యా సంస్కరణల కోసం పనిచేశానని పేర్కొన్నారు.
నీట్-యూజీ 2026 పరీక్షలో వెలుగుచూసిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించి, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించిందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని, విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలు లేదా చట్టపరమైన వివాదాల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, దేశ సేవకు తాను ఎప్పటికీ అంకితభావంతో పనిచేస్తానని లేఖలో పేర్కొన్నారు.
