వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో రూ.99.40 కోట్ల నిధులు
మొత్తం రూ.249.40 కోట్లతో అభివృద్ధి పనులు.. ఇప్పటికే 45 శాతం పూర్తయినట్లు వెల్లడి

వేములవాడ, జూలై 25 (జిందగి9న్యూస్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం మరో రూ.99.40 కోట్ల నిధులను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటివరకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ.249.40 కోట్లకు చేరాయి.
ఇప్పటికే 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు, 2024–25 బడ్జెట్లో రూ.100 కోట్లు విడుదల కాగా, తాజాగా మరో రూ.99.40 కోట్లు మంజూరవడంతో ఆలయ అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు సుమారు 45 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
తాజా నిధుల విడుదలతో ఆలయ మౌలిక సదుపాయాల విస్తరణ, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు ఊతం లభించనుంది. నిధుల మంజూరుపై రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
